పాట్నా, డిసెంబర్ 1: బీహార్‌లో కిడ్నాప్ పెండ్లిళ్లు ఇప్పటికీ జరుగుతున్నాయి. పదేండ్ల క్రితం ఓ సైనికుడిని ఇదే విధంగా అపహరించి, చేసిన పెండ్లిని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ ఈ దారుణాలు ఆగడం లేదు. తాజాగా వైశాలి జిల్లా, రేపుర గ్రామంలో ఉత్క్రామిత్ మధ్య విద్యాలయంలో టీచర్‌గా పని చేస్తున్న గౌతమ్ కుమార్‌ను నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి రాస్తారోకో చేశారు. రాజేశ్ రాయ్ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని ఎత్తుకెళ్లి, ఆయన కుమార్తె చాందినితో పెండ్లి చేశారని ఆరోపించారు. ఈ పెండ్లిని నిరాకరించినందుకు గౌతమ్‌ను శారీరకంగా హింసించారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.