జల్వార్(రాజస్థాన్), జూలై 25: బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్వార్లో శుక్రవారం ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు. ఉదయం తరగతి గదిలో విద్యార్థులు ఉండగా, రాతి శ్లాబ్‌లతో నిర్మించిన పైకప్పు హఠాత్తుగా కూలడంతో శిథిలాల కింద నలిగి ఏడుగురు మరణించారు. గాయపడిన వారిని జల్‌వార్‌లోని దవాఖానకు తరలించారు. మరణించిన విద్యార్థులంతా 7వ తరగతి చదువుతున్న 12-14 ఏండ్ల వయసు వారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన విద్యార్థులను విపత్తు రక్షణ బృందాలు, పోలీసులు, స్థానికులు బయటకు తీశారు. విద్యార్థుల మృతి ఘటన మనసును కలిచివేసిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.