భోపాల్: ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న బాలికలు అక్కడి టీచర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. (School Girls Protest) ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తరగతి గదులను శుభ్రం చేయిస్తున్నారని, కఠిన శిక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. క్లాస్ రూమ్‌లోని ఫ్యాన్లు, కిటికీ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. సరోజినీ నాయుడు బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన వందలాది మంది విద్యార్థినులు బుధవారం భారీ నిరసనకు దిగారు. నెల కిందట ఆ స్కూల్లో చేరిన ఉద్యోగిని వర్షా ఝాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్‌కు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఎండలో నిలబెట్టడంతో సహా చిన్న తప్పులకు కఠినంగా శిక్షిస్తున్నట్లు ఆరోపించారు. క్లాస్ రూమ్, స్కూల్ ఆవరణ శుభ్రం చేయాలని బలవంతం చేస్తున్నారని విమర్శించారు. కొంత మంది బాలికలు స్కూల్ బయట, మరి కొందరు క్లాస్ రూమ్స్‌లో నిరసన తెలిపారు. ఫ్యాన్లు, కిటికీ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
కాగా, విద్యార్థినుల ఆరోపణలను స్కూల్ ప్రిన్సిపాల్ మాలినీ వర్మ ఖండించారు. స్కూల్లో క్రమశిక్షణ అమలు చేసేందుకు మాజీ సైనికురాలైన వర్షా ఝాను నియమించినట్లు తెలిపారు. బాలికల ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. విద్యాశాఖ డైరెక్టర్ కూడా ఆ స్కూల్‌ను సందర్శించారు. వర్షా ఝాను నిరవధిక సెలవుపై పంపారు. కాగా, స్కూల్ డ్రెస్‌లో ఉన్న బాలికల నిరసనలు, విధ్వాంసానికి సంబంధించని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
In Bhopal, School Girls Destroy Fans, Windows To Protest Harsh Punishments@amritanshijoshi reports pic.twitter.com/kt9MELhVeS
— NDTV (@ndtv) September 4, 2024