చెన్నై: పరీక్ష నుంచి తప్పించుకునేందుకు ఒక విద్యార్థి తుంటరి పని చేశాడు. ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడాడు. స్కూల్‌కు వెళ్లని ఆ బాలుడు, తనను కిడ్నాప్ చేయగా తప్పించుకున్నట్లు అందరినీ నమ్మించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. కిల్పాక్లోని స్కూల్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి పరీక్షలు రాయనని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఒప్పుకోకపోవడంతో పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ఒక ప్లాన్ వేశాడు. ఈ నెల 26న స్కూల్ వద్ద ఒక ఆటో డ్రైవర్ తనను కిడ్నాప్ చేసినట్లు ఆరోపించాడు. పచ్చయ్యప్ప కాలేజీ మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద ఆటో ఆగడంతో తప్పించుకుని మెట్రో స్టేషన్లోకి వెళ్లినట్లు ఒకరి ఫోన్ నుంచి తల్లిదండ్రులకు, అక్కడున్న పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
కాగా, ఆ విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ స్కూల్ పరిధిలోని సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే ఎక్కడా కూడా ఆ బాలుడు కిడ్నాప్ అయిన దాఖలాలు కనిపించలేదు. మరోవైపు ఆ రోజున స్కూల్ ఎగ్గొట్టిన ఆ బాలుడు బస్సులో పచ్చయ్యప్ప కళాశాల మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం మెట్రో స్టేషన్లోకి వెళ్లి అక్కడి పోలీసులను కలిశాడు. ఆటో డ్రైవర్ తనను కిడ్నాప్ చేయగా సిగ్నల్ వద్ద తప్పించుకుని మెట్రో స్టేషన్లోకి వచ్చినట్లు చెప్పాడు.
మెట్రో స్టేషన్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో మరునాడు ఆ బాలుడ్ని నిలదీయగా కిడ్నాప్ డ్రామా గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ విద్యార్థిని హెచ్చరించి వదిలేశారు.