అయోధ్య: అయోధ్య రామాలయం చోరీ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మందిలో కనీసం అయిదుగురు విరాళాల లెక్కింపు సమయంలో నోట్ల కట్టలను దాచి పెట్టినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికాైర్డెంది. అయోధ్య పోలీసుల్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… అయిదుగురు నిందితులు తమ దుస్తులు లేదా సాక్సుల్లో నోట్ల కట్టలు దాచి పెట్టడం కనిపించింది. ఆలయ నిర్వాహకులు 45 రోజులకు మించి సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉంచుకోరని.. దీని వల్ల ఈ చోరీ ఎప్పటి నుంచి జరుగుతుందనేది నిర్దిష్టంగా చెప్పలేమని ఒక అధికారి పేర్కొన్నారు.
‘ఆలయ నిర్వహణ తాత్కాలిక విధానంలో నడుస్తున్నది. నోట్ల లెక్కింపు కోసం చాలా మందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకొన్నారు. వారిని నియమించుకొనే ముందు వారి నేపథ్యాన్ని సరిగా పరిశీలించలేదు. లెక్కింపు కేంద్రంలో సరైన తనిఖీలు, సోదాలతో కూడిన పటిష్టమైన ప్రవేశ నియంత్రణ లేదు’ అని ఆయన తెలిపారు.
అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో బీజేపీ లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలోని డోనా పౌలాలో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామాలయం నిర్మాణం కోసం 2021లో భూమి కొనుగోలు చేసినప్పటి నుంచే ఆర్థిక అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆరోపించారు. ‘రూ.2 కోట్ల విలువైన భూమిని ఆలయ ట్రస్ట్ 10 నిమిషాల్లో రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.14 కోట్ల విలువైన భూమిని రూ.95 కోట్లకు కొనుగోలు చేసింది’ అని ఆయన వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో ప్రతి టెండర్లో 40 శాతం కమీషన్ తీసుకొన్నట్టు ఇంజినీర్లే తెలిపారన్నారు. వాళ్లు దేవుడిని మోసం చేసిన విధానం ఇదేనని విమర్శించారు.