న్యూఢిల్లీ: యాసిడ్ దాడి కేసులపై సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ వ్యక్తం చేసింది. దేశ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల పెండింగ్ వివరాలను వెల్లడించాలని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశం జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఆ సమాచారాన్ని ఇవ్వాలని చెప్పింది. ఢిల్లీలో రోహిణి కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ యాసిడ్ దాడి కేసును సుప్రీం విచారిస్తూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా యాసిడ్ దాడి కేసులో విచారణ జరగడం సిగ్గుచేటు అని ధర్మాసనం చెప్పింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయమాలా బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం ధర్మాసనం తన షాక్‌ను వ్యక్తం చేసింది.
షాహీన్ మాలిక్ కేసులో సుప్రీం స్పందిస్తూ.. 2009 నుంచి ఆ కేసు రోహిణి కోర్టులో ఉందని, ఇది న్యాయ వ్యవస్థను పరిహాసం చేయడమే అవుతుందని ధర్మాసనం చెప్పింది. ఇది చాలా సిగ్గుచేటు అంశమని, దేశ రాజధానిలో ఓ కేసు ఇంత కాలం పెండింగ్‌లో ఉంటే, మరి ఎవరు దీన్ని పరిష్కరిస్తారని, ఇది నిజంగా దేశానికే సిగ్గుచేటు అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ పథకాలను పొందేందుకు యాసిడ్ బాధితులను దివ్యాంగులుగా గుర్తించాలని మాలిక్ చేసిన అభ్యర్థనను కేంద్రం పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం చెప్పింది. అయితే ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దివ్యాంగుల క్యాటగిరీలో యాసిడ్ దాడి బాధితుల్ని చేర్చేందుకు చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని సీజేఐ కోరారు.