
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని పలువురి ప్రముఖుల మొబైల్ ఫోన్లను పెగాసస్ స్పైవేర్‌తో కేంద్రం నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై బెంగాల్ ప్రభుత్వం జరుపుతున్న జస్టిస్ లోకూర్ కమిషన్ దర్యాప్తుపై సుప్రీకోర్టు స్టే విధించింది. పెగాసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఒక ఎన్జీవో సంస్థ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.
పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్వతంత్ర కమిటీతో సుప్రీంకోర్టు దర్యాప్తు చేయిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా మరో కమిటీతో దర్యాప్తు చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పెగాసస్ నిఘా వివాదంపై దర్యాప్తు కోసం పలు రంగాలకు చెందిన నిఫుణులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. వ్యక్తులపై విచక్షణారహిత నిఘాను అనుమతించబోమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.