Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించడంలో ఆలస్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బుధవారం సమన్లు జారీ చేసింది.
దీనిపై తాము జనవరి 8న జారీ చేసిన ఉత్తర్వును పాటించకపోవడం పట్ల జస్టిస్‌లు ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పథకం రూపకల్పనకు మేము మంజూరు చేసిన గడువు 2025 మార్చి 15తో ముగిసింది. ఇది కేవలం న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించడమే కాక, చాలా ప్రయోజనకారియైన చట్టాన్ని అమలు చేయకుండా ధిక్కరించడమే’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దీనిపై రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏప్రిల్ 28న తమ ముందు హాజరై కోర్టు ఆదేశాలను ఎందుకు పూర్తి చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నతాధికారులను న్యాయస్థానానికి పిలిచినప్పుడే వారు కోర్టు ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారని పేర్కొంది. కాగా, ఈ చట్టం రూపకల్పనలో కొన్ని ఇబ్బందులున్నాయని ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ న్యాయస్థానానికి తెలిపారు.