న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పరిశీలిస్తున్న క్రమంలో ఫిరాయింపు అనే రాజ్యాంగపరమైన పాపానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యులకు శివసేనకు చెందిన విల్లు-బాణం గుర్తును కేటాయించవచ్చా అని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం షిండే వర్గం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వింటున్నప్పుడు ఈ ప్రశ్నను లేవనెత్తింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అనుకూలంగానా లేక రాజ్యాంగ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసిన వారికి అనుకూలంగానా చిహ్నం భావోద్వేగం(సింబల్ సెంటిమెంట్) పనిచేయాలని జస్టిస్ బాగ్చీ ప్రశ్నించారు. 2022లో శివసేనలో ఏర్పడిన చీలికకు సంబంధించిన పలు పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇందులో షిండే వర్గాన్ని అధికారిక శివసేనగా గుర్తించి, వారికి విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది. మెజారిటీ ఆధారమైన సంఖ్యాబలం గల ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియలు పెండింగ్లో ఉన్నప్పుడు శాసనపరమైన బలాన్ని ఒక సురక్షితమైన పరీక్షగా పరిగణించవచ్చా అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఒక పార్టీ నియమావళిలో స్పష్టమైన ప్రజాస్వామ్య సంస్థాగత నిర్మాణం లేనప్పుడు సంస్థాగత పరీక్ష తప్పనిసరిగా క్షేత్రస్థాయి మద్దతును ప్రతిబింబిస్తుందా అని జస్టిస్ బాగ్చి అడిగారు. రెండు వర్గాలకు రిజర్వ్ గుర్తును(విల్లు-బాణం) నిరాకరించి, వేర్వేరు గుర్తులపై ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలించిందా అని ధర్మాసనం ఇంతకుముందే ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ బుధవారం కూడా కొనసాగనున్నది.
జాతీయ రహదారులపై స్థిరంగా నిలిచి ఉన్న, పార్కింగ్ చేసిన వాహనాలపై వెంటనే ఎలక్ట్రానిక్ నిఘా పెట్టలేరా అని సుప్రీంకోర్టు మంగళవారం భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను ప్రశ్నించింది. రాజస్థాన్లోని ఫలోడిలో నిరుడు నవంబర్లో రోడ్డు ప్రమాదం జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను సుమోటో కేసుగా విచారణ చేస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.