Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు భద్రతా కారణాలు చూపుతూ మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్’ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అభూత కల్పనలు, అర్థసత్యాలతో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించలేదని స్పష్టంచేసింది. మీడియావన్ చానల్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. 2020లో చోటుచేసుకొన్న ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చానల్ వార్తలు ప్రసారం చేయటంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ రెండు రోజుల పాటు చానల్ ప్రసారాలను నిషేధించింది. ఆ తర్వాత ప్రసారాలను పునరుద్ధరించినప్పటికీ 2022లో జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్నదన్న కారణం చూపి కేంద్ర హోంశాఖ ఈ చానల్ లైసెన్సును రద్దుచేసింది. దీనిని సవాల్‌చేస్తూ చానల్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో మీడియావన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై బుధవారం తీర్పు వెల్లడించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మీడియా స్వతంత్రత చాలా ముఖ్యం
కేవలం ఆరోపణలు, ఊహాగానాలను ఆధారంగా చేసుకుని దేశ ప్రజల హక్కులను హరించేందుకు దేశ భద్రతను కారణంగా చూపించకూడదు. కేవలం విమర్శలు చేసిందన్న కారణంతో టీవీ చానల్ లైసెన్స్ రద్దు చేయడం సరికాదు. బలమైన ప్రజాస్వామ్యానికి మీడియా స్వతంత్రత చాలా ముఖ్యం, ప్రజాస్వామ్య సమాజంలో దాని పాత్ర అత్యంత కీలకం.
– జస్టిస్ డీవై చంద్రచూడ్, సీజేఐ