న్యూఢిల్లీ, మార్చి 1: లాభార్జన కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారిని ‘వినియోగదారులు’గా పరిగణించరాదని, వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద అలాంటివారిని వినియోగదారులుగా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఉత్తర్వులకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
యాడ్ బ్యూరో అడ్వైర్టెజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (సిబిల్)కు అక్రమంగా నివేదించినందుకు గాను ఆ సంస్థకు రూ.75 లక్షల నష్టపరిహారంతోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని సెంట్రల్ బ్యాంకును ఎన్సీడీఆర్సీ ఆదేశించడంపై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. వ్యాపార ప్రయోజనాల కోసం రుణాలు తీసుకున్న సంస్థలు వినియోగదారులు కారంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.