Justice Sanjeev Khanna | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సమీక్ష జరుగనున్నది. సమాచారం ప్రకారం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. గతంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గతేడాది అక్టోబర్ 13న స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు. తాజాగా కేసు విచారణ నుంచి సంజీవ్ కన్నా తప్పుకున్నారు.
ఈ కేసును ఓపెన్ కోర్టులో విచారించబోమని.. ప్రత్యేక ఛాంబర్లో విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆయా పిటిషన్లను ఓపెన్ ఫోరమ్‌లో సమీక్షించాలని న్యాయవాదులు కోరగా.. సీజేఐ స్పందిస్తూ.. కేసును రాజ్యాంగ ధర్మాసనం సమీక్షిస్తుందని.. దాన్ని ఛాంబర్లో విచారణకు జాబితా చేసినట్లు పేర్కొన్నారు. చట్టబద్దమైన నిబంధనల ప్రకారం స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. చట్టం ద్వారా మాత్రమే అనుమతి ఇవ్వొచ్చని, చట్టపరమైన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోజాలదని స్పష్టం చేసింది. గత సైతం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఆ సమయంలో గే వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు నిర్ణయానికి 22 మంది మాజీ న్యాయమూర్తులు మద్దతు పలికారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సరైన నిర్ణయమే ఇచ్చిందని వారు పేర్కొన్నారు.