Supreme Court | హత్య కేసులో దోషిగా తేలిన 104 సంవత్సరాల వృద్ధుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చివరి దశలో ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో జన్మించిన రసిక్ చంద్ర మండల్ 1988లో చేసిన హత్య కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష పడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వుల్లో ‘రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు షరతులపై పిటిషనర్ మండల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆదేశిస్తున్నట్లు’గా పేర్కొంది. రసిక్ చంద్ర మండల్ 1920లో మాల్దా జిల్లాలో గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఇదేకావడం విశేషం.
సంవత్సరాలుగా జైలులో ఉంటున్న ఆయన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని కోరుతూ మండల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. 68 సంవత్సరాలు ఉన్న వయసులో హత్య కేసులో దోషిగా తేలారు. వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా అతను జైలు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లోని ఓ కరెక్షనల్ హోమ్‌కి తరలించారు. తనకు విధించిన శిక్షపై ఆయన సవాల్ చేస్తూ 2018లో అప్పీల్ చేయగా.. కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. 2020లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో 100వ పుట్టిన రోజు జరుపుకునేందుకు కొద్ది రోజుల ముందు కోర్టును ఆశ్రయించి.. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ మధ్యంతర బెయిల్‌ను కోరారు. చాలా సంవత్సరాలు కటకటలాల్లో ఉంటున్న ఆయన.. పెరోల్‌పై విడుదల చేయాలని.. లేకపోతే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. పదవి విరమణ చేసిన జస్టిస్ ఏ అబ్దుల్ నజీర్, ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మే 7, 2021న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
భౌతిక పరిస్థితి, ఆరోగ్యం గురించి స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాల్సిందిగా కరెక్షన్ హోమ్ సూపరింటెండెంట్‌ను నోటీసు కోరింది. ఈ కేసు గత శుక్రవారం మళ్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. మండల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర న్యాయవాది ఆస్తా శర్మ.. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే 104వ పుట్టిన రోజును జరుపుకోనున్నారని తెలిపారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. హత్య కేసులో 1994 డిసెంబర్ 12న ట్రయల్ కోర్టు మండల్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆయన కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 2018, జనవరి 5న శిక్షను హైకోర్టు సమర్థించింది. అప్పీల్‌పై హైకోర్టు నిర్ణయం ప్రకటించేందుకు దాదాపుగా 25 సంవత్సరాల సమయం పట్టింది. మార్చి 11, 2019న హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయన మళ్లీ తన 48 సంవత్సరాల కొడుకు ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాతం కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా తనను జైలు నుంచి విడుదల చేయాలని అభ్యర్థించాడు.