హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకం మంగళవారం నుంచి రెండేండ్లు పాటు కొనసాగనుంది. ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని నేతృత్వంలో ఉన్న జాతీయ భద్రతా కౌన్సిల్కి ఈ బోర్డు సూచనలు చేస్తుంది. బోర్డులో సభ్యులుగా మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, ఆర్మీ సదరన్ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ విదేశాంగ శాఖ అధికారి బీ వెంకటేశ్ వర్మను నియమించారు. తాజాగా రక్షణ రంగ నిపుణుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డికి కేంద్రం చోటు కల్పించింది.