Satellite Toll | దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సాంకేతిక కమిటీ సెక్యూరిటీ, ప్రైవసీ అంశాలపై మరింత చర్చించాలని సిఫారసు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. ఏఎన్పీఆర్ (Automatic Number Plate Recognition) టెక్నాలజీ ఆధారంగా ఫాస్టాగ్ (FASTag) వ్యవస్థను కారిడార్లు, కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ నేషనల్ హైవేపై ఇప్పటి వరకు శాటిలైట్ ఆధారిత టోల్ ట్యాక్స్ వ్యవస్థ పని చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ సాంకేతికతను అమలు చేసేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికపై పని చేస్తోందన్నారు. తద్వారా టోల్ వసూలు వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయవచ్చని.. ఈ వ్యవస్థ ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ కంటే ప్రయాణాన్ని వేగంగా, సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొన్నారు. టోల్ వసూలును మరింత సమర్థవంతంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం మల్టిపుల్ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించిందని గడ్కరీ చెప్పారు. ఈ వ్యవస్థలో ఏ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు ఆగాల్సిన అవసరం లేదని.. వేగాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉండదన్నారు. ఫాస్టాగ్‌తో పాటు ఈ కొత్త వ్యవస్థను కొన్ని ఎంపిక చేసిన భాగాల్లో అప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. ఆయా మార్గాల వెంట వెళ్లే వారు తమ వాహనాలు ఆపకుండానే టోల్‌ను చెల్లించగలుగుతారన్నారు.
ఈ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశ్రమ, విద్యాసంస్థల నిపుణులు, భద్రత, గోప్యతా కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థపై మరిన్ని చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పిందని గడ్కరీ తెలిపారు. ఇందు కోసం ప్రభుత్వం రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్‌ను (RFP)ని ఆహ్వానించిందని.. త్వరలోనే అమలు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం కొత్తగా ఫాస్టాగ్ వార్షిక ప్లాన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేసేందుకు. ఈ పాస్ ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఈ పాస్ ఏడాది, 200 టోల్ లావాదేవీల్లో ఏది ముందయితే అది చెల్లుబాటవుతుంది. ఈ పాస్ ప్రయాణికుల ఖర్చులను తగ్గిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సౌకర్యం ప్రైవేట్ ప్రయాణీకుల వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది.