న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని స్పేస్ఎక్స్ (SpaceX)తన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ (Star Link) సేవలను వచ్చే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ రెసిడెన్షియల్ ప్లాన్ ధర నెలకు రూ.8,600, శాటిలైట్ డిష్ కిట్ ధర రూ.34,000 అని ఈ కంపెనీ ప్రకటించింది. యూజర్లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. తమ సేవలు యూజర్లకు సంతృప్తికరంగా లేకపోతే, వారు చెల్లించిన సొమ్మును పూర్తిగా తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించింది. 99.9 శాతం అప్‌టైమ్‌తో అపరిమిత డాటాను అందించనున్నట్లు పేర్కొంది. డౌన్లోడ్ స్పీడ్ 40-220+ ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడ్ 8-25+ ఎంబీపీఎస్, లేటెన్సీ 20-60ఎంఎస్. స్టార్‌లింక్ అందుబాటులోకి రావడంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పెను మార్పులు రానున్నాయి.స్టార్‌లింక్‌తో పోల్చుకుంటే, జియో, ఎయిర్టెల్ ధరలు చాలా చౌక. అయితే స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. కాబట్టి కొండలు, అడవుల్లోనూ ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి.