భోపాల్ : సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ప్రముఖ బుల్లితెర నటి, ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో ఫేమ్ వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకున్నది. మధ్యప్రదేశ్ ఇండోర్ సాయిబాగ్‌లోని తన ఇంట్లో నటి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైశాలి ఆత్మహత్య వార్త టీవీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు, నోట్లో వైశాలి పేర్కొన్న కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టానికి తరలించారు.

ఉజ్జయినిలోని మహిద్‌పూర్ వైశాలి స్వస్థలం కాగా.. ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్లో సంజన పాత్రను పోషించగా.. మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్లో అంజలి పాత్రను పోషించింది. ఆ తర్వాత వైశాలి యే వాదా రహా, యే హై ఆషికి, సూపర్ సిస్టర్, లాల్ ఇష్క్.. ఔర్ విష్, అమృత్ తదితర సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించింది. టీవీ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లోనూ వైశాలి కనిపించింది. ఇదిలా ఉండగా.. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌కు వైశాలి స్నేహితురాలు. సుశాంత్ ఆత్మహత్యను వైశాలి ఠక్కర్ హత్యగా ఆరోపించింది. సుశాంత్ మృతికి రియా చక్రవర్తి కారణమని విమర్శించింది.