Air Taxi | న్యూఢిల్లీ, జనవరి 19: హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో జనాలు ‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు! రోడ్డుమీద ఓ ఆటో లేదా ఓ ట్యాక్సీ ఎక్కినట్టుగా..‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కి, గాలిలో ప్రయాణించే సదుపాయం రాబోతున్నది. ఇండియాలో మొట్టమొదటి ఎయిర్‌ట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ను బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది.
ఎయిర్ ట్యాక్సీ సేవలను 2028నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. ‘శూన్య’ ఎయిర్ ట్యాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 20 నుంచి 30 కిలోమీటర్ల స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. దీంట్లో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించవచ్చునని, మహా నగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని కంపెనీ చెప్పింది.