చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్ మోర్చా (ఎస్ఎస్ఎం) పోటీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ బల్బీర్ సింగ్ రాజేవాల్ నేతృత్వంలోని ఎస్ఎస్ఎం, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే, అది ఖచ్చితంగా ఆప్ ఓట్లను మింగేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని తాను ఒప్పుకుంటున్నానని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించిన అరవింద్ కేజ్రీవాల్, బుధవారం మొహాలీలో మాట్లాడారు. ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పది పాయింట్ల ‘పంజాబ్ మోడల్’ని సిద్ధం చేసినట్లు చెప్పారు.
మరోవైపు ఎన్నికల హామీలను కూడా అరవింద్ కేజ్రవాల్ ప్రకటించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే 18 ఏండ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామన్నారు. ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత వచ్చే ఐదేండ్లలో తిరిగి వచ్చేలా సంపన్న పంజాబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాను, అవినీతిని అంతం చేస్తామని కేజ్రీవాల్ అన్నారు. అన్ని కేసులలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రతి పంజాబీకి ఉచిత వైద్యం కల్పిస్తామన్నారు. అలాగే 24 గంటలు ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు.