Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో స్వయంగా నామినేషన్ వేయనున్నారు. నామపత్రాలను వ్యక్తిగతంగా వెళ్లి దాఖలు చేసేందుకు ఢిల్లీ కోర్టు శనివారం అనుమతి ఇచ్చింది. సంజయ్ సింగ్ తరపున దాఖలు చేసిన దరఖాస్తును ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ స్వీకరించారు. ఎన్నికలకు సంబంధించి అండర్‌టేకింగ్‌లు, నామినేషన్ ఫారాలు, ఇతర ఆధారాలపై సంతకం చేయడానికి అనుమతించాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. సంజయ్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నెల 27తో ఆయన పదవీకాలం ముగియనున్నది.
ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి ఆయనను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. సంజయ్ సింగ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సంజయ్ సింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 4న అరెస్టు చేసింది. రద్దు చేసిన ఎక్సైజ్ డ్యూటీ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. డిసెంబర్ 22న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. పాలసీ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.