బెంగళూర్ : కర్నాటకలో (karnataka polls) కాంగ్రెస్ ఘన విజయంతో మోదీ వేవ్ ముగిసిందని, భజరంగ్ బలి కాంగ్రెస్ వైపు ఉన్నట్టు స్పష్టమైందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బజరంగ్ బలి గధ బీజేపీపై పడిందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభ మసకబారిందని, ఇక తమ వేవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ సర్కార్‌ను సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన సమావేశం కానున్నామని చెప్పారు.
రానున్న సార్వత్రిక సమరానికి ఇక సంసిద్ధమవుతామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల ఓటమిగా అంతకుముందు సంజయ్ రౌత్ అభివర్ణించారు. హనుమాన్, ప్రధాని మోదీ ఇమేజ్‌లను ట్వీట్ చేసిన రౌత్ హనుమాన్ ఫొటోపై భజరంగ్‌బలి 130+ స్ధానాలు అని, ప్రధాని మోదీ ఇమేజ్‌పై భజరంగ్‌దళ్ 60+ స్ధానాలని రాసుకొచ్చారు. నియంత పోకడలను ప్రజలు నిలువరించగలరని కర్నాటక ప్రజలు స్పష్టం చేశారని రౌత్ అన్నారు.
కర్నాటకలో బీజేపీ ఓడిపోతే ఘర్షణలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని, కానీ కర్నాటక ప్రస్తుతం సంతోషంగా, ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. ఘర్షణలు ఎక్కడ చెలరేగాయని రౌత్ ప్రశ్నించారు. ఇది మోదీ, షాల పరాజయమని ఆయన అభివర్ణించారు. కర్నాటకలో ఇవాళ జరిగింది 2024 లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
Read More