ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను వీడి ఆయన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపడం మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) బ్లాక్ డేగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అభివర్ణించారు. అవినీతి నేతలు జైల్లో ఉండాలని, కానీ ఇప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ మరో 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర సర్కార్‌లో మంత్రులుగా కొలువు తీరడంతో ఎన్సీపీలో చీలిక అనివార్యమైంది. మరోవైపు పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది నేతలపై అనర్హత వేటు వేయాలని లేకుంటే వీరు పార్టీ ప్రయోజనాలను పణంగా పెడతారని పార్టీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. ఎన్సీపీ అధినేత సహా పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం లేకుండా గుట్టుగా వీరు ఫిరాయింపులకు పాల్పడినందున వీరిపై అనర్హత వేటు తప్పదని కమిటీ తీర్మానించింది.
కాగా మహారాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 53 కాగా, వారిలో 9 మంది పార్టీ ఫిరాయించగా మిగిలిన ఎమ్మెల్యేలందరూ తమతో ఉన్నారని ఎన్సీపీ చీఫ శరద్ పవార్ స్పష్టం చేశారు. తిరిగి పార్టీలోకి వచ్చేందుకు తాము వారికి అవకాశం ఇచ్చామని, పార్టీలోకి తిరిగిరాని ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని పవార్ హెచ్చరించారు. బీజేపీ-షిండే శివసేన సర్కార్‌లో అజిత్ పవార్, మరో 8 మంది ఎమ్మెల్యేలు చేరిన అనంతరం అజిత్ పవార్ తనను మోసగించాడని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
Read More :
Gas cylinder price | మళ్లీ కట్టెలపొయ్యి కష్టాలు.. కేంద్ర సర్కారు ధరల మోతతో సిలిండర్లకు మంగళం