Sanjay Raut : మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి (Ex CM) ఉద్ధవ్ ఠాక్రే (Uddav Thakray) మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పలువురు ఎంపీలు ఏక్నాథ్ శిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) లో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మాటలను బీప్ చేయొద్దని పాత్రికేయులకు సూచించారు.
‘ద్రోహులు వెళ్లిపోవాలి. అసమ్మతివాదులు మొదట రాజీనామా చేయాలి. పార్టీ టికెట్‌పై గెలిచినవారికి ప్రజాతీర్పును మోసగించే హక్కు లేదు. పార్టీ మారేందుకు కొందరు ఎంపీలకు రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తున్నది. అయితే మాకు చీలిక గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలతో ఈ విషయం మా దృష్టికి వచ్చింది’ అని రౌత్ అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన (యూబీటీ) చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని చెప్పారు.