Samsung | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ పెద్దయెత్తున ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేయడానికి నిర్ణయించినట్టు రైటర్స్ సంస్థ వెల్లడించింది. అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా రీజియన్స్‌లోని సేల్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల సిబ్బందిని ఎక్కువగా తొలగించే అవకాశం ఉంది.
భారత్‌లో వెయ్యి మందికి ఉద్వాసన పలకవచ్చు. ఈ తొలగింపులు ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, దీనిపై శాంసంగ్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ సిబ్బంది సర్దుబాటు సహజ ప్రక్రియేనని, పని సామర్థ్యం పెంచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. స్మార్ట్ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, మెమరీ చిప్స్ వంటివి తయారు చేసే అగ్రగామి సంస్థ శాంసంగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 2,67,800 మంది సిబ్బంది ఉన్నారు.