ముంబై, మే 14: లంచం డిమాండ్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కీలక వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేశారని వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సమీర్ వాంఖడే ఇల్లు, బంధువుల ఇండ్లు, ఆస్తులపై ఏకకాలంలో 29 చోట్ల సోదాలు నిర్వహించింది. దీనిపై స్పందించిన వాంఖడే.. ‘దేశభక్తుడిని అయినందుకే నాకు ఈ బహుమానం దక్కుతున్నది. నా భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా 18 మంది సీబీఐ అధికారులు 12 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. వారికి రూ.23 వేలు, నాలుగు ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. అవి కూడా నేను ఉద్యోగంలో చేరకముందే కొన్నవి’ అని పేర్కొన్నారు.