Sameer Wankhede | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను సీబీఐ శనివారం ముంబయిలో ఐదుగంటలకుపైగా ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను ఇరికించకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే రూ.25కోట్ల లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమీర్ ఉదయం 10.15 గంటల సమయంలో బాంద్రా కుర్లా కాంపెక్స్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన ‘సత్యమేవ జయతే’ అంటూ వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 30 నిమిషాల లంచ్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి సీబీఐ కార్యాలయంలో విచారణకు వచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు విచారణ తర్వాత వెళ్లిపోయారు. సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత సమీర్ వాంఖడే విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. ఈ కేసులో గురువారం విచారణకు పిలిచినా.. హాజరకాలేదు. నేరపూరిత కుట్ర, బెదిరింపులతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఎన్సీబీ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ నెల 11న మాజీ జోనల్ డైరెక్టర్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసింది.
అయితే, ఈ కేసులో బొంబాయి హైకోర్టు ఊరట కల్పించింది. ఈ మే 22 వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. కార్డెలియా క్రూయిజ్ షిప్ మాదక ద్రవ్యాలు పట్టుబడిన తర్వాత ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3, 2021న ఎన్సీబీ అరెస్టు చేసింది. ఎన్సీబీ సాక్ష్యాధారాలను చూపడంతో విఫలం కావడంతో మూడు వారాల తర్వాత హైకోర్టు ఆర్యన్‌ఖాన్‌తో పాటు మరికొందరికి బెయిల్ మంజూరు చేసింది. 2021 అక్టోబర్‌లో క్రూయిజ్ షిప్లో డ్రగ్స్‌కు సంబంధించి ఎన్సీబీలోని ముంబయి జోన్‌కు సమాచారం అందిందని, నిందితులను విడుదల చేసేందుకు బదులుగా కొందరు భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లుగా కుట్రపన్నినట్లుగా సీబీఐ ఆరోపిస్తున్నది.