లక్నో : ఈవీఎంలను ఎన్నికల కమిషన్ అధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఈసీపై తనకు విశ్వాసం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించిన క్రమంలో ఆ పార్టీ బుధవారం ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈవీఎంల తరలింపుకు అనుసరించాల్సిన ప్రొటోకాల్‌లో లోపాలున్నాయని వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ విలేకరులతో చెబుతున్న వీడియోను ఎస్పీ ట్వీట్ చేసింది. అయితే ట్రైనింగ్‌కు వాడే ఈవీఎంల గురించే తాను ప్రస్తావించానని ఆపై ఆయన సర్ధిచెప్పారు.
ఈవీఎంల తరలింపునకు అనుసరించాల్సిన ప్రొటోకాల్ గురించి మీరు మాట్లాడితే ఇందులో లోపాలున్నాయని దీపక్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. దీన్ని తాను అంగీకరిస్తానని, కానీ ఓటింగ్‌లో వాడిన మెషిన్లను తీసుకెళ్లడం అసాధ్యమని, ఇందుకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఈవీఎంలకు మూడంచెల భద్రత ఉంటుందని, ఈవీఎం కేంద్రాల వెలుపల రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం నిఘా కోసం కూర్చోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వార్తలు వస్తున్నాయని, ఎవరి సమక్షంలో ఇదంతా జరుగుతోందని ఆ ట్వీట్లో సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తావించింది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారా..ఈసీ దీనిపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీ నిలదీసింది. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా ఈనెల 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా, అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ సర్కార్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.