లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక రానున్నదని చెప్పారు. ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. యూపీ పంచాయతీ రాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ‘సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక రాబోతోంది. ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ సమర్పించారు. మైనింగ్ స్కామ్, గోమతీ నదీ తీర అభివృద్ధి (గోమతీ రివర్ ఫ్రంట్) కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారి ఎవరో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. చట్టం ఉచ్చు బిగుసుకుంటుండటంతో ఎస్పీ ఆందోళన చెందుతోంది’ అని హిందీలో ట్వీట్ చేశారు.
కాగా, ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన సోషల్ మీడియా పోస్ట్‌ను సమర్థించుకున్నారు. మొత్తం సమాజ్‌వాదీ పార్టీ బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంది’ అని ఒక టీవీ ఛానల్‌తో అన్నారు. ‘ఇది వంద శాతం నిజం. రాజ్‌భర్ ఏది చెప్పినా ధైర్యంగా, నిజాయితీగా చెబుతారు’ అని అన్నారు. తన వాదనకు సంబంధించిన వివరాలు అడిగినప్పుడు, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. ‘ఇప్పుడే పేరు బయటపెడితే, ఆ ప్రయత్నమంతా వృథా అవుతుంది. కొన్ని రోజులు వేచి ఉండండి’ అని మీడియాతో అన్నారు.
మరోవైపు 2022 ఎన్నికల్లో రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకున్నది. 19 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఆరు సీట్లలో గెలిచింది. అయితే ఫలితాలు వచ్చిన కొద్ది నెలలకే, 63 ఏళ్ల రాజ్‌భర్ ఎస్పీతో సంబంధాలు తెంచుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఏలో తిరిగి చేరారు.