న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చీలకలు వచ్చినట్లు తెలుస్తోంది. అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మిస్సయ్యాయి. సోమవారం జరిగిన ఇండియా కూటమి మీటింగ్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరం అయ్యింది. అయితే ఇవాళ కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) గైర్హాజరైంది.
కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు తమ నిరసనలతో స్పష్టం అవుతున్నది. మిత్రపక్షాల డిమాండ్ గురించి కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. పార్లమెంట్లో ఇండియా కూటమి నేతలు ఆరు అంశాలపై ప్రశ్నలు వేయాలనుకున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కోత, మణిపూర్ సంక్షోభం లాంటి అంశాలపై కూడా చర్చ జరగాలని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం అదానీ అంశాన్నే ప్రస్తావిస్తున్నది. దీంతో ఖర్గే నిర్వహించిన మీటింగ్కు టీఎంసీ, ఎస్పీ దూరంగా ఉన్నాయి.
లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద మూడవ పార్టీ అయిన ఎస్పీ .. ఇవాళ జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొనలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.