లక్నో: మహా కుంభమేళాపై (Maha Kumbh) ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్ర స్నానాలతో భక్తుల పాపాలు పోయి స్వర్గం నిండిపోతుందని అన్నారు. హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్నది. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
కాగా, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఎంపీ అఫ్జల్ అన్సారీ దీనిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం ద్వారా ప్రజల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. భారీ జన సమూహాన్ని చూస్తుంటే, ఇప్పుడు ఎవరూ నరకంలో మిగిలి ఉండరని, స్వర్గం నిండిపోతుందని అనిపిస్తోంది’ అని అన్నారు. అలాగే కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కుంభమేళాలో భారీగా గంజాయి సేవిస్తారని గతంలో కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు దేవ్ ప్రకాష్ సింగ్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్సారీ తన పదవీ గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ అన్సారీపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.