PM Modi | భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని.. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందననారు. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని.. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్నారు. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఈ 140కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు. ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని ప్రధాని తెలిపారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని.. తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ని తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్ ఎదగాలని.. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్‌స్టేషన్ త్వరలో సాకారం కావాలన్నారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. వికసిత భారత్ 2047 నినాదం 140కోట్ల మంది కలల తీర్మానమని.. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని.. వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు.
సర్జికల్ స్ట్రయిక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకువస్తున్నామని.. నేషన్ ఫస్ట్.. రాష్ట్ర్ హిత్ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. భారత బ్యాకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని.. జల్‌జీవన్ మిషన్ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. భారత్ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలని.. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని.. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు.