ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భద్రతను ఎక్స్ నుంచి వై ప్లస్‌కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు. మరోవైపు సల్మాన్ ఇంటి వద్ద రోజంతా ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు రావడంతో ముంబై పోలీసులకు చెందిన ప్రొటెక్షన్ బ్రాంచ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచాలని నిర్ణయించింది.
సల్మాన్ భద్రత విధుల్లో ఇప్పటి వరకూ ఒక సాయుధ గార్డు పనిచేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ ఉన్నారనే సమాచారంతో బాలీవుడ్ కండలవీరుడికి భద్రతను పెంచారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఆయన ఫామ్ హౌస్ వద్ద మాటు వేశారనే సమాచారంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు పొంచి ఉందనే అనుమానంతో సల్మాన్ ఖాన్ భద్రతను వైప్లస్కు పెంచారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్కూ వైప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు.
ఇక సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబై పోలీస్ కమిషనర్‌ను కలిసిన అనంతరం ఆయన దరఖాస్తును పరిశీలించిన పోలీసులు ఇటీవల బాలీవుడ్ స్టార్‌కు పర్సనల్ వెపన్ లైసెన్స్ జారీ చేశారు. సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి సల్మాన్ ఖాన్ నటించిన గాడ్‌ఫాదర్ అక్టోబర్ 5న విడుదల కాగా, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సెట్స్‌పై ఉంది. ఇక కత్రినా కైఫ్‌తో జోడీగా సల్మాన్ ఖాన్ సందడి చేసిన టైగర్ 3 వచ్చే ఏడాది దివాళీ రోజు థియేటర్లలోకి రానుంది.