Salam Aarti | కర్ణాటకలోని ఆలయాల్లో ఇకపై సలాం ఆరతి కనిపించదు. 300 ఏండ్ల క్రితం టిప్పు సుల్తాన్ పాలన ఆదేశాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మార్చివేసింది. ఈ ఆరతి పేరును సంధ్యా ఆరతిగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. హిందుత్వ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. టిప్పు సుల్తాన్ పేరిట సలాం ఆరతితో కూడిన ఆచారాలను రద్దు చేయాలని పలు సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దాంతో హిందూ దేవాలయాలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అథారిటీ ముజ్రాయ్ 6 నెలల క్రితం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మెల్కోట్లోని చారిత్రాత్మక చలువ నారాయణ స్వామి ఆలయంలో టిప్పు సుల్తాన్ హయాం నుంచి ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు సలాం ఆరతి నిర్వహిస్తున్నారు. ఈ ఆరతి పేరు మార్చాలని కర్ణాటక ధార్మిక పరిషత్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కుక్కి సుబ్రహ్మణ్య ఆలయం, పుత్తూరులోని శ్రీ మహాలింగేశ్వర ఆలయం, కొల్లూరులోని మూకాంబిక ఆలయంతోపాటు మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో కూడా సలాం ఆరతి జరుపుతున్నారు. మండ్య జిల్లా యంత్రాంగం ఈ ప్రతిపాదనను హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ (ముజ్రాయ్) కు సమర్పించింది.
ప్రస్తుతం మెల్కోట్లోని చలువ నారాయణస్వామి ఆలయంలోనే ఈ ఆరతి పేరు మార్పు జరిగినట్లుగా తెలుస్తున్నది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, అవి రాగానే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలు చేస్తామని ముజ్రాయ్ మంత్రి శశికళ జోలె తెలిపారు. ఈ ఆరతిని మార్చి ప్రదోష పూజ అని పిలువాలని కొల్లూరు ఆలయ అధికారులను గతంలోనే విశ్వహిందూ పరిషత్ కోరింది.