రాజమండ్రి: షెడ్యూల్ మార్పు కారణంగా షిర్డీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు (Sainagar Shirdi Express) రాజమండ్రిలో నిలిచిపోయింది. ఈ నెల 1 నుంచి కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు. మారిన సమయం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకే కాకినాడ నుంచి రైలు బయల్దేరింది. గతంలో ఈ రైలు 6 గంటలకు అక్కడి నుంచి ప్రారంభమయ్యేంది. దీంతో రైలు వేళలపై ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో అధికారులు రైలును రాజమండ్రిలో నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ఉన్న ప్రయాణికులను శేషాద్రి ఎక్స్ప్రెస్లో అక్కడికి తరలిస్తున్నారు. వారు చేరుకున్న తర్వాతే రైలు అక్కడినుంచి బయల్దేరనుంది. దీంతో గత మూడు గంటలుగా అక్కడే నిలిచిపోయింది. అయితే ముందు స్టేషన్లలో ఉన్న ప్రయాణికులు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, సమయం మార్పుపై ముందుగానే సమాచారం ఇచ్చామని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.