Saif Ali Khan | ముంబై, జనవరి 16 ( నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబైలోని బాంద్రాలో ఆయన నివసిస్తున్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులోని ఫ్లాట్‌లోకి ప్రవేశించిన ఒక దుండగుడు కత్తితో పలుసార్లు పొడవడంతో సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు. తీవ్రంగా రక్తస్రావం అయిన ఆయనను ఆటోలో లీలావతి హాస్పిటల్‌కు తరలించగా, అత్యవసర శస్త్రచికిత్స చేశారు.
54 ఏండ్ల సైఫ్‌కు ప్రాణాపాయం తప్పిందని లీలావతి హాస్పిటల్ సీఓఓ నీరజ్ ఉత్తమా తెలిపారు. సైఫ్ అలీఖాన్‌కు మొత్తం ఆరు గాయాలయ్యాయని, అందులో రెండు చిన్నవి, రెండు మధ్యస్థమైనవని చెప్పారు. ఒక గాయం వెన్నెముకకు దగ్గరలో ఏర్పడిందన్నారు. వెన్నెముక దగ్గర ఇరుక్కుపోయిన 2.5 అంగుళాల కత్తిముక్కను తొలగించామని తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో భవనంలో సైఫ్ అలీ ఖాన్, అతని భార్య, నటి కరీనా కపూర్, వారి ఇద్దరి కుమారులు జెహ్ (4), తైమూర్ (8), ఐదుగురు పనివారు ఉన్నారు. జెహ్, తైమూర్ గదిలో ఉన్న జెహ్ కేర్‌టేకర్, నర్సు అయిన ఎలియమా ఫిలిప్ తొలుత దుండగుడిని గుర్తించి అడ్డుకుంది. నిందితుడి చేతిలో కర్రతోపాటు హాక్సా బ్లేడ్ ఉందని, వాటితో తనను గాయపరిచాడని, అరవద్దని హెచ్చరించాడని వెల్లడించింది. తనకు కోటి రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడని తెలిపింది.
ఈ గొడవకు సైఫ్, కరీనాలు లేచి అక్కడికి రాగా, సైఫ్‌పై ఆ వ్యక్తి దాడి చేశాడని చెప్పింది. ఇంతలో పనివారొకరు రావడంతో దుండగుడు పారిపోయాడని పేర్కొంది. సైఫ్ గాయపడిన విషయాన్ని 8వ అంతస్తులో నివసిస్తున్న అతని మొదటి భార్య పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, కుమార్తె సారా అలీఖాన్‌కు పనివారు తెలపడంతో వారు తండ్రిని కిందకు తీసుకువచ్చారు.డ్రైవర్ అందుబాటులో లేకపోవడం, వారి ఎలక్ట్రిక్ వాహనం ఎలా ఆపరేట్ చేయాలో తెలియక ఆటోలో లీలావతి దవాఖానకు తరలించారు.
దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సైఫ్ ఇంట్లో దోపిడీ కోసం ఫైర్ ఎగ్జిట్ మెట్ల మార్గం ద్వారా లోపలికి వచ్చాడని, అంతకుముందు అతను కొన్ని గంటల పాటు అక్కడే నక్కి ఉన్నాడని ముంబై పోలీస్ డీసీపీ గెడం దీక్షిత్ తెలిపారు. సైఫ్ ఇంటి నుంచి ముగ్గురు వ్యక్తులను విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో దాడిలో గాయపడిన ఇంటి పనిమనిషి కూడా ఉంది. ఇంట్లో ఉన్నవారిలో ఎవరో ఒకరు దుండగుడిని లోపలికి అనుమతించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. విచారణ నిమిత్తం క్రైం బ్రాంచ్ రాగా,ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
వాణిజ్య రాజధాని ముంబైలో సెలబ్రిటీలకు సైతం రక్షణ కరవైందని మహారాష్ట్ర విపక్ష నేతలు విమర్శించారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలకు ఈ ఘటన నిదర్శనమనని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ముంబైలో సెలబ్రిటీల భద్రత కూడా ప్రశ్నార్ధకంగా మారిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. కాగా, ముంబైను సురక్షిత నగరంగా ఉంచడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవల దేవర చిత్రంలో తనతో నటించిన సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం జరగడంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహానగరంలో ఈ దారుణమేంటని నటి పూజాభట్ నిలదీశారు. సైఫ్ సోదరి సబా పటౌడి, నటి పరిణీతి చోప్రా, స్వరభాస్కర్, నటులు సోనూసూద్ సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.