నాందేడ్: శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాలో ఆయనపై గురువారం కిర్పన్తో అటాక్ జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ పూర్తి అయిన తర్వాత ఆయన్ను ఇవాళ డిశ్చార్జ్ చేశారు. నేరుగా ఆయన ఆస్పత్రి నుంచి పంజాబ్‌కు పయనమయ్యారు. సుమారు 90 నిమిషాల పాటు ఆయనకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. గురుద్వారా మాతా సాహిబ్ దేవన్ జీ ముగట్ ఆవరణలో నిహంగ్ వర్గానికి చెందిన సిక్కు శిరోమణి నేతపై దాడి చేశారు. 2024 డిసెంబర్లో కూడా సుఖ్బీర్ బాదల్‌పై గోల్డెన్ టెంపుల్లో అటాక్ జరిగిన విషయం తెలిసిందే.
ఇవాళ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో సుఖ్బీర్ మాట్లాడారు. పంజాబ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో వాళ్లు ఉన్నారని, రాష్ట్రంలో శాంతిని భంగం చేయాలని చూస్తున్నారని, కానీ అకాలీదళ్ నేతగా ఆ పరిస్థితి రానివ్వబోనన్నారు. రెండు సార్లు పవిత్రమైన ప్రదేశాల్లో తనపై అటాక్ జరిగిందని, నేను ఎప్పుడూ భయపడలేదని, ఇప్పుడు కూడా భయపడలేదన్నారు. పంజాబీల మంచి కోసం శిరోమణి అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు.
శిరోమణి ఎటువంటి త్యాగాన్నైనా చేస్తుందని, పంజాబ్ ప్రగతి, మత సామరస్యం తమకు ప్రాధాన్యమైందన్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై అటాక్ చేసిన వ్యక్తి వయసు 62 ఏళ్లు ఉంటుంది. నిందితుడిని జస్పాల్ సింగ్‌గా గుర్తించారు. కామర్స్, లా పట్టాలు ఉన్నాయి. అతని స్వస్థలం పుణె. కానీ నాందేడ్ గురుద్వారాలో రెండేళ్లు వాలంటరీ సేవ చేస్తున్నాడు. బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.