Rudraprayag Accident | ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కాగా, మరరో 13 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని హెలికాప్టర్లలో ఎయిర్‌లిఫ్ట్ చేసి రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు.
మృతులు, క్షతగాత్రులు ఢిల్లీ శివారులోని నోయిడాకు చెందిన వారు కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో టెంపో ట్రావెలర్‌లో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ నగరానికి ఐదు కిలోమీటర్ల ముందు బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, డీడీఆర్ఎఫ్, ఇతర బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
అయితే, రైల్వేలైన్‌లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు రక్షించేందుకు నదిలోకి దూకగా.. ఇందులో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. స్థానిక అడ్మినిస్ట్రేషన్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు.