Maharashtra | ముంబై,మార్చి 6: మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు.
ముంబైలోని ఘట్కోపర్లో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జోషి మాట్లాడుతూ ముంబైకు ఒకే భాష అంటూ ఏదీ లేదని చెప్పారు. ముంబైలోని వేర్వేరు ప్రాంతాలలో భిన్న భాషలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఘట్కోపర్ ప్రాంతంలో గుజరాతీ మాట్లాడతారని ఆయన అన్నారు. అందువల్ల ముంబైలో నివసించే వారంతా కచ్చితంగా మరాఠీ నేర్చుకోవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యలపై వివాదం ఏర్పడడంతో జోషి గురువారం వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. మరాఠీ భాష ముంబై, మహారాష్ట్రకు చెందినదని ఆయన చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారు, ఇతర భాషలు మాట్లాడేవారు కూడా మరాఠీని అర్థం చేసుకోవడం అవసరమని జోషి తెలిపారు. తాను కూడా మరాఠీ వాడినేనని, ఇందుకు తాను గర్విస్తున్నానని ఆయన చెప్పారు.
జోషి వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం తీవ్రంగా స్పందించారు. విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ జోషి వ్యాఖ్యల వెనుక ఆర్ఎస్ఎస్ రహస్య అజెండా ఉందని ఆయన ఆరోపించారు. ముంబైని చీల్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ఇవే మాటలు గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్లో అని క్షేమంగా వెనక్కు రాగలరా అంటూ జోషిని ఠాక్రే సవాలు చేశారు. మరాఠీ మనుషులు స్వాగతిస్తున్నారని ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవరూ సహించరని హెచ్చరించారు. జోషిపై దేశద్రోహం కేసును నమోదు చేయాలని ఆయన డిమాండు చేశారు. జోషి వ్యాఖ్యలకు నిరసనగా దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్ వద్ద ప్రతిపక్ష ఎంవీఏ నాయకులు ధర్నా చేశారు.
జోషి వ్యాఖ్యలపై ప్రభుత్వ వైఖరి ఏమిటని శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ గురువారం అసెంబ్లీలో ప్రశ్నించగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ జవాబిస్తూ భయ్యాజీ వ్యాఖ్యలేమిటో తనకు తెలియదని, అయితే ముంబైలో, మహారాష్ట్రలో నివసించే వారంతా తప్పనిసరిగా మరాఠీ నేర్చుకుని, మాట్లాడి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు. తన మాటలతో జోషి కూడా ఏకీభవిస్తారని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు. అయితే శివసేన(యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది దేశద్రోహమేనని, మహారాష్ట్రను అవమానించడమేనని రౌత్ ఆరోపించారు.