న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అక్రమాలు, నెట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వంటి ఘటనల పట్ల ఆర్ఎస్ఎస్తో పాటు అనుబంధ సంఘాలు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం కచ్చితంగా జవాబు చెప్పాల్సిందేనని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞల్క్య శుక్ల గురువారం పేర్కొన్నారు.
‘ఎన్టీఏలో నిర్వహణలోపం ఉందనే అభిప్రాయం ఉంది. పలు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు 15-20 నిమిషాలు ఆలస్యంగా ఎలా వెళ్తాయి? ఒకే కేంద్రానికి చెందిన 7-8 మంది విద్యార్థులకు 100 శాతం మార్కులు ఎలా వస్తాయి? 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఎలా వస్తాయి? ఎన్టీఏ విశ్వసనీయతపై క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలి’ అని ఆయన పేర్కొన్నారు.