బెంగళూరు, ఆగస్టు 16 : కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సైలీ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) చేసిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం సహా కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న బ్యాంక్ ఖాతాలు లభించాయి. కర్ణాటక సహా నాలుగు రాష్ర్టాల్లో ఈడీ ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది.
అక్రమంగా ఇనుప ఖనిజం ఎగుమతులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీశ్ కృష్ణపై మనీలాండరింగ్ కేసులో గత గురు, శుక్రవారాల్లో ఈడీ ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎమ్మెల్యేకు సంబంధించి రూ.1.68 కోట్ల నగదు, 6.75 కిలోల బంగారం పట్టుబడిందని, రూ.14.13 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాల్ని గుర్తించామని ఈడీ తెలిపింది. బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేశామని ఈడీ అధికారులు ప్రకటించారు.