Kerala woman : చికెన్ తిని ఆస్పత్రిపాలైన ఒక మహిళకు పరిహారం చెల్లించాలని చికెన్ వడ్డించిన కేఫ్‌కు వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.96 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన కేరళలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివి. కేరళ, రాన్ని టౌన్‌లోని చెతోంకారా అనే ప్రాంతంలో కింగ్స్ బిర్యాని కేఫ్ ఉంది. ఈ కేఫ్‌లోకి గత ఏడాది అక్టోబర్ 21న వెచ్చూచిరాకు చెందిన రీనా థామస్ తన సోదరితో కలిసి వెళ్లారు.
ఈ కేఫ్‌లో ఆమె అల్ఫహాం అనే ఒక అరేబియన్ డిష్ ఆర్డర్ చేశారు. ఇది చికెన్‌తో తయారు చేసే అరేబియన్ డిష్. అయితే ఈ డిష్ తింటున్నప్పుడు అది ఒక రకమైన రుచి, వాసన వచ్చాయి. దీంతో ఆమె దీని గురించి వెంటనే వెయిటర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫుడ్ అలాగే ఉంటుందని, అదే తమ కుకింగ్ స్టయిల్ అని వారికి నచ్చజెప్పాడు. ఈ డిష్ సరిగా లేకపోవడంతో రీనా చాలినంత తినగా, ఆమె సోదరి కొద్దిగా మాత్రమే తిన్నది. మిగిలింది పార్శిల్ చేయించుకుని తీసుకెళ్లారు. మొత్తానికి బిల్లు రూ.740 చెల్లించారు.
ఈ ఫుడ్ తిని, ఇంటికి వెళ్లగానే రీనాకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే వెచ్చూచిరా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కానీ, అక్కడ కూడా ఆమె పరిస్తితి విషమంగానే ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కంజిరాపల్లిలోని మరింత పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆమెకు వారం రోజులు చికిత్స అందించారు. కలుషిత, పాడైన ఆహారం తినడం వల్ల ఆమెకు సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వచ్చిందని, అందువల్లే రీనా అనారోగ్యం పాలైందని డాక్టర్లు తెలిపారు. దీనిపై రీనా కొడుకు కింగ్స్ బిర్యానీ కేఫ్ వారిని సంప్రదించగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
రూ.6,000 మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. దీంతో రీనా జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కమిషన్ విచారణ జరిపింది. అన్ని అంశాలు, ఆధారాల్ని పరిశీలించింది. ఈ విషయంలో కేఫ్ నిర్లక్ష్యాన్ని గుర్తించిన కమిషన్.. బాధితురాలు రీనాకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. కేఫ్ ఓనర్, మేనేజర్ కలిపి రూ.96,500 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో హాస్పిటల్ బిల్లుల కోసం రూ.36,500, పరిహారంగా రూ.50,000, కోర్టు ఫీజుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అది కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని సూచించింది.