చండీగఢ్ : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై ( Neeraj Chopra ) దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్‌కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. 23 ఏండ్ల నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దాంతో భారత్‌కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో 100 ఏండ్ల తర్వాత తొలి స్వర్ణం వచ్చినట్లయ్యింది.
జావెలిన్ త్రో మూడు రౌండ్లలోనూ బరిసెను ఎక్కువ దూరం విసిరి నీరజ్ ఆధిక్యత ప్రదర్శించాడు. రెండో రౌండ్లో అయితే అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి చెక్ రిపబ్లిక్కు చెందిన ఇద్దరు అథ్లెట్లు జాకబ్ వాద్లెచ్, విటెజ్స్లెవ్ వెసెలీలను వెనక్కి నెట్టాడు. దాంతో బంగారు పతకం నీరజ్ ఖాతాలో పడింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నీరజ్ ఈవెంట్‌ను చూస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన నీరజ్ చోప్రాకు అభినందనలని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భం కోసం దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నదని, ఇప్పుడు నీరజ్ చోప్రా దేశ ప్రజల కల నెరవేర్చాడని ఖట్టర్ ట్వీట్ చేశారు.