ముంబై, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : భోజన బిల్లులో సర్వీస్ చార్జీని వసూలు చేసిన ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ రూ.50,000 జరిమానా విధించింది. బోరా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
ముంబై నివాసి ఒకరు ఏప్రిల్‌లో బోరా రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. అసలు ఆర్డర్ మొత్తం, GSTపై 10 శాతం సర్వీస్ చార్జీని వసూలు చేశారు. దీనిపై ఆయన యాజమాన్యాన్ని ప్రశ్నించి, దానిని తీసివేయాలని కోరగా, వారు దానికి నిరాకరించారు. దీంతో ఆయన అథారిటీకి ఫిర్యాదు చేశారు.