న్యూఢిల్లీ: మూడవ సంతానం మగ పిల్లవాడైతే ఓ గోవును… లేదా ఆడపిల్ల పుడితే 50 వేలు ఇస్తానని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు(MP Appala Naidu) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అప్పల నాయుడు ప్రకటించిన ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఆ వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. జనాభా ప్రతిపాపదికన డీలిమిటేషన్ చేపట్టేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైన నేపథ్యంలో.. తెలుగు దేశం పార్టీ నేత అప్పలనాయుడు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. విజయనగరంకు చెందిన ఎంపీ శనివారం ఆ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మూడవ సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చే మహిళలకు గోవును బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒకవేళ అమ్మాయి పుడితే, వారికి తన జీతం నుంచి 50 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని స్కీమ్లను కూడా ప్రకటించారు. దానికి తగినట్లే ఎంపీ అప్పలనాయుడు ఈ ఆఫర్ వెల్లడించారు.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉన్నది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియతో ఉత్తరాదికి లాభం చేకూర అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పిల్లల్ని కనేందుకు ఆడవాళ్లకు ఆఫర్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధిక లోక్సభ సీట్లు రావాలంటే, జనాభా సంఖ్య ఇంకా పెరగాల్సి ఉన్నది. అయితే ఎంపీ అప్పలనాయుడు చేసిన ప్రకటనను ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమర్థించారు. జనాభా ప్రతిపాదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టరాదు అని ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకునేందుకు .. ఏడుగురు సీఎంలతో స్టాలిన్ భేటీకి పిలుపునిచ్చారు.