ముంబై : ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న బస్సు నుంచి సుమారు 5 కోట్ల ఖరీదైన మాదకద్రవ్యాలను సీజ్(Drugs Seized) చేశారు. నైజీరియాకు చెందిన మహిళ నుంచి ఆ డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి కోసమైతే డ్రగ్స్ తీసుకెళ్తున్నారో, ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బస్సులో దొరికిన డ్రగ్స్‌లో మెటాంఫెటమైన్ ఉన్నది. నిషేధిత వస్తువులను.. ఫుడ్ ప్యాకెట్లలో పెట్టి తీసుకెళ్తున్నారు. ఓట్స్, జూస్ టెట్రా ప్యాకెట్లలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా.. ఢిల్లీ నుంచి వస్తున్న బస్సును డీఆర్ఐ అధికారులు అడ్డగించారు.
ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలోనే ఆ బస్సును తనిఖీ చేశారు. మహిళ నుంచి 2.56 కేజీల మెటాంఫటమైన్తో పాటు 584 గ్రాముల ఎక్స్టసీ ట్యాబెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెంటింటి విలువు 5 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా రేవ్ పార్టీల్లో మెటాంఫటమైన్, ఎక్స్టసీ ఎక్కువగా వాడుతుంటారు. నార్కోటిక్ డ్రగ్స్ చట్టం ప్రకారం నైజీరియా మహిళను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది.