రాయ్‌పూర్: ఒక బ్యాంకు వద్ద అనుమానాస్పదంగా రెండు కార్లు నిలిచి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కార్లను తనిఖీ చేశారు. ఒక కారులో రూ.2.64 కోట్ల నగదు ఉండటం చూసి షాకయ్యారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. (Cash Seized From Car) ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున సెక్టార్-1 ప్రాంతంలోని ఓ బ్యాంకు వద్ద రెండు కార్లు అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భిలాయ్ భట్టి పోలీస్ స్టేషన్ సిబ్బంది, యాంటీ క్రైమ్, సైబర్ విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండు కార్లను తనిఖీ చేశారు. ఒక కారులో రూ.2.64 కోట్ల నగదు ఉండటాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, రెండు కార్లకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను ఈ డబ్బు గురించి పోలీసులు ఆరా తీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కారు నుంచి రూ.2.64 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ విభాగానికి సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.