బెంగళూరు, సెప్టెంబర్ 6: కర్ణాటకలో అధికార బీజేపీ నేతల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (పీఎస్ఐ) స్కామ్‌లో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దురుగప్ప పేరు బయటకువచ్చింది. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి నుంచి ఏకంగా రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్టు తేలింది. ఏడాదిన్నర అవుతున్నా ఇంకా ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన ఆ అభ్యర్థి తండ్రి తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ తాజాగా బయటకు వచ్చింది.
తాను బెంగళూరులో ఉన్నానని, ఆ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చానని, తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నట్టు ఆ క్లిప్పింగ్‌లో ఉన్నది. 543 ఎస్సై పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే చార్జిషీటు దాఖలైందని, ఎమ్మెల్యే బసవరాజ్ ఆడియో క్లిప్పింగ్‌పై కూడా సీఐడీ విచారణకు ఆదేశించామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
ప్రభుత్వానికి ఇచ్చానన్న ఎమ్మెల్యే
డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చానంటూ బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్‌పై బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్‌ను వివరణ అడగ్గా.. రెండు వర్గాల మధ్య ఈ విషయంలో గొడవ జరుగుతున్నదని, సమస్య పరిష్కరించాలని తనను కోరితే మధ్యవర్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. డబ్బుల గురించి తనకేమీ తెలియదని పేర్కొన్నారు.