న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా 2021లో భారతదేశం పలు కీలక రంగాల్లో దాదాపు రూ.12 లక్షల కోట్లు(15,900 కోట్ల డాలర్లు) ఆదాయం కోల్పోయిందని తాజా నివేదిక పేర్కొన్నది. ఇది దేశ జీడీపీలో 5.4 శాతమని తెలిపింది. సేవలు, తయారీ, వ్యవసాయం, నిర్మాణం రంగాలపై ఈ తీవ్రమైన వేడి పరిస్థితుల ప్రభావం పడిందని పేర్కొన్నది. దేశంలో అధిక వేడి పరిస్థితులు 16,700 కోట్ల పని గంటల నష్టానికి దారితీసిందని, ఇది 1990-99తో పోలిస్తే 39 శాతం అధికమని పలు అంతర్జాతీయ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక ైక్లెమేట్ ట్రాన్సపరెన్సీ రిపోర్టు-2022 వివరించింది. 2016-21 మధ్యకాలంలో దేశంలో తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రతికూల ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటి వలన 3.6 కోట్ల హెక్టార్లలో పంట దెబ్బతినడంతో రైతులకు దాదాపు రూ.29 వేల కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక తెలిపింది.