ఇంటివద్దనే నీటి నుంచి హైడ్రోజన్
కారు లేదా వంటింట్లో ఇంధనంగా వినియోగం
నిల్వ, తరలింపు చాలా సులువు
సోలార్ కంటే ఖర్చు కూడా తక్కువే
పర్యావరణహిత ఇంధన తయారీలో కీలకం
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పర్యావరణహితమైన ఇంధనం అనగానే సౌరవిద్యుత్తును తలచుకుంటారు. సౌర విద్యుత్తుతో పర్యావరణానికి ఉన్న లాభాలు తక్కువేం కాదు. అయితే, దాని ఉత్పత్తికి అవసరమైన సౌర పలకల ఖర్చు ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి అయిన విద్యుత్తును నిల్వ చేసుకొని వినియోగించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇక్కడ చాలా మంది వీటిపై ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇటీవల సౌర విద్యుత్తు స్థానంలో హైడ్రోజన్ పేరు వినిపిస్తున్నది. ఇది పర్యావరణ హితమైనదే కాక, ఉత్పత్తి ఖర్చూ తక్కువ. హైడ్రోజన్ జనరేటర్ కరెంటును ఉత్పత్తి చేయడానికి నీళ్లు అవసరం. అంటే పగటి పూటే కాకుండా ఎప్పుడంటే అప్పుడు విద్యుత్తు ఉత్పత్తి చేసుకొని వాడుకోవచ్చన్నమాట.
ఎలా పని చేస్తుంది?
హైడ్రోజన్ జనరేటర్ అనేది ఒక యంత్రం. దీనిని ఇంటి పై కప్పుపై అమర్చుతారు. దీనిలోకి నీటిని పంపిస్తారు. ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతి ద్వారా ఇది నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేసి వాయువుగా మార్చుతుంది. దీన్ని కారులో వాడుతామా, వంటింట్లో వాడుతామా అనేది మన ఇష్టం. ప్రస్తుతం తయారుచేస్తున్న జనరేటర్లు నడవడానికి విద్యుత్తు అవసరం. భవిష్యత్తులో సూర్యరశ్మి ద్వారా నేరుగా ఈ ప్రక్రియ జరిగే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. సూర్యరశ్మి సాయంతో నీటి నుంచి హైడ్రోజన్‌ను విడగొట్టే ఉత్ప్రేరకాన్ని కనిపెట్టినట్టు మద్రాస్ ఐఐటీ సౌర ఇంధన పరిశోధనా బృందం అధిపతి అరవిందకుమార్ చంద్రన్ ఆగస్టులో వెల్లడించారు. ఐఐటీ-గువాహటి శాస్త్రవేత్తలు కూడా ఇదే తరహా పదార్థాన్ని తయారు చేశారు. ఈ సాంకేతికతలు పూర్తిస్తాయిలో అభివృద్ధి చెందితే చిన్నసైజు హైడ్రోజన్ జనరేటర్లు అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు.
ఖర్చు ఎంత?
మరో పదేండ్లలో హైడ్రోజన్ వినియోగం ఇప్పటితో పోలిస్తే వెయ్యి రెట్లు పెరగవచ్చని అంచనా. డిమాండ్‌కు తగినట్టుగా హైడ్రోజన్ జనరేటర్లు అందుబాటులోకి రావచ్చు. జనరేటర్లలో నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయడానికి ఎలక్ట్రోలైజర్లను వాడతారు. ప్రస్తుతం వీటి ఖరీదు ఎక్కువగా ఉంది. కిలో హైడ్రోజన్ ఇంధనం తయారీకి రూ.750 దాకా ఖర్చు అవుతున్నది. అయితే జనరేటర్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి వినియోగిస్తే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. మరోవైపు, ఎలక్ట్రోలైసిస్ కోసం విద్యుత్తు వాడకుండా కొన్ని కంపెనీలు ఈ జనరేటర్ల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే సోలార్ బ్యాటరీలను కూడా తయారు చేస్తున్నాయి.