న్యూఢిల్లీ: చైనాకు చెందిన షెంజౌ-19 వ్యోమనౌక సిబ్బంది తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో అద్భుతం చేశారు. కృత్రిమ కిరణ జన్య సంయోగ క్రియ సాయంతో రోదసిలో మొదటిసారిగా ఆక్సిజన్, రాకెట్ ఇంధన ముడి పదార్థాలను సృష్టించారు. సెమీ కండక్టర్ ఉత్ప్రేరకాల సాయంతో పెట్టె లాంటి ఆకారం గల పరికరంలో కార్బన్ డయాక్సైడ్, నీటిని వారు ఆక్సిజన్‌గా మార్చగలిగారు. రాకెట్ ఇంధనంగా ఉపయోగించగల హైడ్రో కార్బన్ ఇథిలీన్నూ సైతం పరిశోధకులు ఉత్పత్తి చేయగలిగారు. కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ సాంకేతికత ఎనర్జీ వినియోగాన్ని తగ్గించి గది ఉష్ణోగ్రత వద్ద ప్రామాణిక వాతావరణ ఒత్తిడి వద్ద సమర్థంగా పని చేస్తుంది. ఇది మీథేన్ లాంటి చోదక వాయువులను ఉత్పత్తి చేయగలదు.